Delhi, 8 November
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులను ఇకపై కేవలం విలువ ఆధారంగా కాకుండా, రైతుల అవసరాలు, భూమి వివరాలను కూడా బ్యాంకులు పరిశీలించనున్నాయి. ఈ మేరకు ముసాయిదా
వ్యవసాయ రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రాధాన్యత రంగ రుణాల నిబంధనలకు సంబంధించి కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ముఖ్యంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకునే వ్యవసాయ రుణాలపై నిబంధనలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది.
ఇకపై బంగారం తాకట్టు పెడితే సరిపోదు. రైతులకు ఇచ్చే రుణాలను కేవలం బంగారం విలువ ఆధారంగా వ్యవసాయ రుణాలుగా పరిగణించలేరు. రైతులు సాగు చేస్తున్న భూమి, పంటల వివరాలు, వ్యవసాయ అవసరాలను బ్యాంకులు తప్పనిసరిగా పరిశీలించాలి. అవసరమైతే బ్యాంకు అధికారులు నేరుగా పొలాలను సందర్శించి తనిఖీలు చేయాలి. తీసుకున్న రుణాన్ని వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారా లేదా అనేది కూడా పరిశీలించాలి.
కౌలు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు తమ అర్హతను ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలతో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తీసుకోవడం నిషేధం కాదు. కానీ ఆ రుణం ప్రాధాన్యత రంగ రుణాల కింద పరిగణించాలంటే వాస్తవ వ్యవసాయ అవసరాలను బ్యాంకులు నిర్ధారించాల్సి ఉంటుంది.
వ్యవసాయ రుణాల పేరుతో జరుగుతున్న అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు నిజమైన రైతులకు మాత్రమే వ్యవసాయ రుణాల ప్రయోజనాలు అందేలా చూడటమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపింది.
గమనిక: ఇవి విడుదల చేసిన ముసాయిదాలోని ప్రతిపాదనలు మాత్రమే. తుది మార్గదర్శకాలు, అమలు తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.











