జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి బుధవారం వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణీ స్త్రీలు, వారికి తోడుగా వచ్చేవారికి మా కృపా చారిటబుల్ ట్రస్ట్ గత 22 వారాలుగా నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ట్రస్ట్ సభ్యులే స్వయంగా వంట చేసి భోజనాలు వడ్డిస్తున్నారు.
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అనే సంకల్పంతో, మా కృపా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మావిళ్ల కృష్ణ (కిట్టు) గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, వారికి తోడుగా వచ్చేవారికి ఈ అన్నదానం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే, ట్రస్ట్ సభ్యులే స్వయంగా పరిశుభ్రత, శుచిశుభ్రత పాటిస్తూ వంటలు తయారు చేసి, ఇతరులపై ఆధారపడకుండా భోజనాలు వడ్డిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం పలువురు దాతలు, సహృదయుల సహాయ సహకారాలతోనే నిరంతరాయంగా కొనసాగుతోందని కిట్టు గురుస్వామి తెలిపారు.
ఒకరోజు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలు, వారితో వచ్చిన సహాయకులు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించానని, ఆసుపత్రి పరిసరాల్లో భోజనం చేసేందుకు సరైన హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో వారి ఆకలి బాధను తీర్చాలనే ఆలోచన కలిగిందని ఆయన వివరించారు. అప్పటి నుంచి తన వంతు బాధ్యతగా ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు.
గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షల సమయంలో భోజనం కోసం ఇబ్బందులు కలగకూడదనే మానవతా దృక్పథంతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం, నేడు 22 వారాలు పూర్తి చేసుకుని నిరంతరంగా కొనసాగడం విశేషం.
కిట్టు గురుస్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన రాష్ట్ర బీజేపీ నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ఈ తరహా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముచ్చర్ల కృష్ణయ్య సైతం, మా కృపా ట్రస్ట్ సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మా కృపా ట్రస్ట్ సభ్యులందరూ పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెబుతోంది.












