జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పంచాయతీ భవనాలు మెరుగైన పరిపాలనా సేవలకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
రాజకీయాలు ఎన్నికల వరకు పరిమితం అని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరుతో పేద ప్రజల సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు. ఎల్ నినో సూపర్ ఎల్ నినోగా మారబోతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి కరెంటు, నీరు పొదుపుగా వాడాలని సూచించారు.
రైతులు ఆరుతడి పంటలు సాగు వైపు ఆలోచన చేయాలని సూచించారు. రైతుల పంట ఉత్పత్తుల అమ్మకం ప్రక్రియలో, కరెంటు విషయంలో సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజెంగి నందయ్య, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, ఉపసర్పంచ్ లక్ష్మణ్, ఎంపీడీఓ రమాదేవి, ఎంఆర్ఓ హకీం, రవి బాబు, విజయ్, మాజీ సర్పంచ్ అంకం సతీష్, పెండెం రాములు, నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, వార్డు సభ్యులు, గ్రామస్తులు, నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








