ప్రతి ఇంటా జాతీయ భావం వెల్లివిరియాలి, నిరుపేదలకు అండగా నిలవాలి
దీపావళి అనగానే ప్రతి ఇంటా దీపాల వెలుగులు, పండుగ సందడి, ఆనందోత్సాహాలు కనిపిస్తాయి. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఆకాంక్షలు నింపుతుంది. అయితే మారుతున్న కాలంలో దీపావళి పండుగకు మరింత గొప్ప అర్థాన్ని జోడించాల్సిన అవసరం ఉందని దేశభక్తి భావాలు కలిగిన పలువురు అభిప్రాయపడుతున్నారు.
మన ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ దీపాలు వెలిగించడం మన సంప్రదాయం. అదే సంప్రదాయంలో మనకు జన్మనిచ్చిన భారతమాతను స్మరించుకుంటూ తొలి దీపాన్ని దేశమాతకు అంకితం చేస్తే ఆ పండుగకు మరింత ప్రత్యేకత చేకూరుతుంది.
మనం నివసిస్తున్న ఈ నేల, మనం పీలుస్తున్న గాలి, మనకు అన్నం పెడుతున్న భూమి ఇవన్నీ మన జీవితంలో అంతర్భాగాలు. ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అందుకే ఈ దీపావళికి తొలి దీపం భరతమాతకు, రెండో దీపం మన కుటుంబానికి, మరో దీపం సమాజంలోని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంకితం చేద్దాం.
దేశం బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి. సమాజంలో శాంతి, సామరస్యం ఉంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, నిరుపేదలకు అండగా నిలవడం, పర్యావరణాన్ని కాపాడటం, దేశ ఐక్యతను గౌరవించడం వంటి మంచి పనులకు ఈ పండుగను ఒక ప్రేరణగా మార్చుకోవాలి.
మన కష్టాలు తొలగాలని దేవుడిని కోరుకునే ముందు మనకు జీవనాధారమైన ఈ భూమాతను గౌరవిద్దాం. మనకు గుర్తింపునిచ్చిన భారతమాతకు మనసారా వందనం సమర్పిద్దాం. ప్రతి ఇంట్లో వెలిగే ఒక్కో దీపం దేశం పట్ల బాధ్యతను గుర్తుచేసే జ్యోతిగా మారాలి.
ఒక దీపం ఇంటికి వెలుగునిస్తుంది ఒక దేశభక్తి భావం కోట్లాది హృదయాల్లో వెలుగులు నింపుతుంది.
ఈ దీపావళి కేవలం పండుగగా మిగిలిపోకుండా దేశభక్తి, మానవత్వం, సేవాభావం పెంపొందించే వేడుకగా మారాలి. ప్రతి భారతీయుడి హృదయంలో దేశం పట్ల గౌరవం, ప్రతి ఇంటి గడపపై భరతమాతకు అంకితమైన తొలి దీపం వెలగాలని ఆకాంక్షిద్దాం.
జై భరతమాత జై హింద్
మద్దిరాల , జిల్లా సాఫ్ట్ రిపోర్టర్











