నల్గొండ, 2026-11-03
మెప్మా అదనపు డైరెక్టర్ శ్రీ యాదగిరి రావు ఇంట్లో ఏసీబీ భారీగా అక్రమాస్తులను గుర్తించారు. రంగారెడ్డి రేంజ్ పరిధిలో నిర్వహించిన సోదాల్లో రూ. 4.75 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నగదు, బంగారం బయటపడ్డాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా - ) అదనపు డైరెక్టర్ శ్రీ యాదగిరి రావు నల్లాగుంట అక్రమాస్తుల కేసులో ఏసీబీ (యాంటీ కరెప్షన్ బ్యూరో) అధికారులు దూకుడు పెంచారు. అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారనే పక్కా సమాచారంతో రంగారెడ్డి రేంజ్ పరిధిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు చెందిన ఇల్లు, కార్యాలయం, బ్యాంకు లాకర్లతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 10 ప్రాంతాలలో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో భారీ ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్థిరాస్తులు: హైదరాబాద్ సిటీ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో 12 ఖాళీ స్థలాలు (రూ. 58,63,000/-), ఉప్పల్‌లో రెండు నివాస ఫ్లాట్లు (రూ. 31,36,000/-), ఉప్పల్‌లో ఒక 3 నివాస భవనం/పెంటహౌస్ (రూ. 2,00,00,000/-), సూర్యాపేటలో ఒక ఆర్సీసీ ఇల్లు (రూ. 4,75,000/-), ఉప్పల్‌లో ఒక కమర్షియల్ షాప్ (రూ. 1,06,000/-) గుర్తించారు. వీటి మార్కెట్ విలువ అధికారిక లెక్కల కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. బంగారు, వెండి ఆభరణాలు: సుమారు 1,792.2 గ్రాముల బంగారం (రూ. 33,82,000/-), 3 కిలోల వెండి (రూ. 1,80,000/-) లభించాయి. వాహనాలు ఇతర వస్తువులు: రెండు కార్లు (టయోటా ఫార్చ్యూనర్ మరో కారు - రూ. 73,00,000/-), మూడు టూ-వీలర్లు (రూ. 2,80,000/-), గృహోపకరణాలు (రూ. 29,08,000/-), ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు (రూ. 7,01,171/-) స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు నిల్వలు: వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ. 32,30,000/- నగదు బ్యాలెన్స్‌లను గుర్తించారు.
వీటన్నింటినీ కలుపుకుంటే నిందితుని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 4,75,61,171/- (రూ. 4.75 కోట్లకు పైగా) ఉంటుందని ఏసీబీ అధికారులు తేల్చారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988 కింద కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని ఎస్పిఈ ఏసీబీ కేసుల ప్రత్యేక ప్రిన్సిపాల్ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్, ఎక్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.












