ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో టేకులపల్లిలోని కేసీఆర్ టవర్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గంజాయి, చోరీ నిందితులను గుర్తించారు. ఈ తనిఖీల్లో 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
టేకులపల్లిలోని కేసీఆర్ టవర్ ప్రాంతంలో గంజాయి సేవిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఖమ్మం డివిజన్ పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. సిఏఆర్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఈగల్ ఫోర్స్, క్లూస్ టీమ్ సహా మొత్తం 286 మంది అధికారులు ఈ ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్నారు. కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా 52 బ్లాకులలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 105 మంది వేలిముద్రలు తీసుకుని పరిశీలించారు. గంజాయి అమ్ముతున్న ఇద్దరిని, గంజాయి సేవిస్తున్న 12 మందిని, 50 గ్రాముల పొడి గంజాయిని, ముగ్గురు చోరీ నిందితులను, ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు కోరుకున్నట్లు పోలీస్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తామని, బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, నేటి అప్రమత్తతే రేపటి భద్రమైన భవిష్యత్తుకు పునాది అని అన్నారు. గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో సహకరించాలని కోరారు. యువత భవిష్యత్తును కాపాడటంలో భాగస్వాములు కావాలని సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీనివల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. స్థానికంగా ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని సూచించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని సూచించారు. ముఖ్యంగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే స్థానిక పోలీసులకు గానీ డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి చిరునామా, ఆధార్ కార్డులు చూసిన తరువాతనే ఇవ్వాలని స్థానికులకు వివరించారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నేరస్థులను గుర్తించడంతో పాటు నేరాలను నియంత్రించేందుకు దోహదపడతాయని తెలిపారు. నేరాల నియంత్రణ కొరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ సిబ్బంది ఆయా ప్రాంతాల స్థితిగతులపై సమాచారం తెలుసుకుంటూ, పాత నేరస్థుల సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. స్థానిక ప్రజలకు ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, ఫణిందర్, సర్వర్, సిఐలు సాదిక్ పాషా, చిట్టిబాబు, కరుణాకర్, శివప్రసాద్, నాగరాజు, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్ పాల్గొన్నారు.


