** (ధర్మ రథం) జూలై 09
కోరుట్ల పట్టణంలో భార్యాభర్తల గొడవ హత్యకు దారితీసింది. అల్లమయ్య గుట్ట ప్రాంతంలో భర్త ఇప్ప కాశీరాం (35)ను భార్య రజిని రోకలిబండతో మోది దారుణంగా హత్య చేసింది. భర్త వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు.
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటనలో నిందితురాలైన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెట్పల్లి డీఎస్పీ ఏ. రాములు కోరుట్ల సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అల్లమయ్య గుట్టకు చెందిన ఇప్ప కాశీరాం (35), రజిని దంపతులకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఒకసారి రజిని మద్యం సేవించిన విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా, అప్పటి నుండి కాశీరాం రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ, పిల్లలను ఇబ్బంది పెట్టేవాడని సమాచారం. భర్త వేధింపుల నుండి విముక్తి పొందేందుకు, ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని రజిని నిర్ణయించుకుంది. గత 20 రోజుల క్రితం కూడా రజిని తన భర్తపై కర్రతో దాడి చేయగా, స్థానికులు కాశీరాంను కాపాడి ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో, నిన్న (జూలై 8) మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి చెట్ల పండుగకు వెళ్ళిన కాశీరాం, సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత, రజిని తన పిల్లలను ముందుగానే పుట్టింటికి పంపించి, పథకం ప్రకారం భర్తతో గొడవకు దిగింది. రాత్రి 11:45 గంటల సమయంలో కాశీరాంపై కోపంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపైన, ఇతర శరీర భాగాలపై బలంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కాశీరాం అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం అక్కడి నుండి పారిపోయిన రజిని, అయ్యప్ప స్వామి ఆలయం వెనుక ఉన్న బంధువుల వద్ద ఆశ్రయం పొందింది. ఈరోజు ఆమె పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, నమ్మదగిన సమాచారం అందుకున్న కోరుట్ల సీఐ, ఎస్సై మరియు సిబ్బంది నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితురాలిని త్వరితగతిన పట్టుకున్న సీఐ, ఎస్సై మరియు సిబ్బందిని మెట్పల్లి డీఎస్పీ ఏ. రాములు ప్రత్యేకంగా అభినందించారు.
ఒకే ఒక్క క్షణపు ఆవేశం, ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, భార్యను కటకటాల వెనక్కి నెట్టిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.










