మంచిర్యాల జిల్లా రాయికల్ లోని విస్డం హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని మన్హా మోబిన్, ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ (ఐసిఐ) నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 13 ఏళ్ల అతి చిన్న వయసులోనే ప్రొఫెషనల్ ట్రైనర్ గా గుర్తింపు పొందడం విశేషం.
ఐసిఐ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షకుల సదస్సులో 30 మంది పాల్గొన్నారు. వీరిలో 35 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ మంది ఉండగా, మన్హా మోబిన్ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రాం లో పాల్గొని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆమె, తన పాఠశాలైన విస్డం హైస్కూల్ లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గోల్ సెట్టింగ్, టైమ్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించింది.
కరస్పాండెంట్ అభినందన
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎ. ఎం.రాజు రెడ్డి మన్హా మోబిన్ ను ఘనంగా సన్మానించారు. ఆమె నర్సరీ నుండి ఇదే పాఠశాలలో చదువుతోందని, విద్యార్థుల సర్వాంగీన వికాసానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు పబ్లిక్ స్పీకింగ్ వంటి కార్యక్రమాలతో స్టేజి ఫియర్ పోగొట్టేలా శిక్షణ ఇస్తున్నామని, తమ పాఠశాల మోటో మీ పిల్లలను మాకు ఇవ్వండి... నాయకులుగా తిరిగి తీసుకెళ్లండి అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

