పాపువా న్యూ గినియా ()లోని పోర్ట్ మోర్స్బీ నౌకాశ్రయంలో చైనాకు చెందినట్లు భావిస్తున్న భారీ ఫిరంగి గుండు ఒకటి కలకలం రేపింది. ఓ వాణిజ్య షిప్పింగ్ కంటైనర్‌లో నిర్మాణ సామగ్రి మధ్య ఈ అనుమానాస్పద వస్తువు బయటపడటంతో పోలీసులు, సైనిక బాంబు నిర్వీర్య నిపుణులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో నలుగురు చైనా పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వస్తువు ఆయుధం కాదని, ఫిరంగి గుండు ఆకారంలో తయారు చేసిన వైన్ బాటిల్ మాత్రమేనని చైనా రాయబార కార్యాలయం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పోలీసుల దర్యాప్తులో అది నిజమైన పేలుడు పదార్థాలతో కూడిన ఫిరంగి గుండుగా గుర్తించినట్లు ఆస్ట్రేలియా మీడియా కథనం వెల్లడించింది. దీంతో ఒకే వస్తువుపై రెండు విరుద్ధమైన వాదనలు తెరపైకి వచ్చాయి.

షిప్పింగ్ కంటైనర్‌లో అనుమానాస్పద వస్తువు
పాపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీలోని ఓ ప్రధాన నౌకాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాణిజ్య అవసరాల కోసం వచ్చిన కంటైనర్‌లో నిర్మాణ సామగ్రిని తనిఖీ చేస్తున్న సమయంలో ఫిరంగి గుండును పోలిన పెద్ద లోహపు వస్తువు కనిపించింది. దీంతో స్థానిక కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పాపువా న్యూ గినియా రక్షణ దళానికి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు అక్కడికి చేరుకున్నారు. ముందుజాగ్రత్తగా పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించి, వస్తువును సురక్షిత ప్రాంతానికి తరలించారు.
నలుగురు చైనా పౌరుల అరెస్ట్
ఈ వస్తువు విదేశాల నుంచి వచ్చిన వాణిజ్య కంటైనర్‌లో దాచిపెట్టి తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి నలుగురు చైనా పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోర్ట్ మోర్స్బీలో అదుపులో ఉంచినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించారు కంటైనర్‌లో ఎలా చేరింది దీని వెనుక అక్రమ రవాణా వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చైనా మాత్రం అది వైన్ బాటిల్ అంటోంది
ఈ ఘటనపై పాపువా న్యూ గినియాలోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో స్పందించింది. సంబంధిత కంపెనీ ప్రతినిధులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, అది ఫిరంగి గుండు ఆకారంలో ఉన్న వైన్ బాటిల్‌గా గుర్తించినట్లు తెలిపింది. చైనా రాయబార కార్యాలయం వెల్లడించిన అంశాల ప్రకారం, ఆ వస్తువు ఎలాంటి ప్రమాదం కలిగించదని పేర్కొంది. చైనాలో ఆయుధాల నియంత్రణకు అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలిపింది. చైనా నుంచి అక్రమంగా సైనిక స్థాయి ఫిరంగి గుండు తరలించడం దాదాపు అసాధ్యమని వాదించింది. పాపువా న్యూ గినియా పోలీసుల అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. అయితే చైనా రాయబార కార్యాలయం చేసిన ఈ ప్రకటనను తుది అధికారిక నిర్ధారణగా పరిగణించలేం.