🛡️ (ధర్మ రథం) జూలై 15
నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను నిలువరించేందుకు భారత ప్రభుత్వం ఒక కీలక పథకాన్ని ప్రకటించింది. బినామీ ఆస్తుల గురించి పక్కా సమాచారం అందించిన వారికి భారీ నగదు బహుమతులు ప్రకటించింది. ఈ పథకం ద్వారా సామాన్యులు కూడా లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంది.
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు భారత ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బినామీ ఆస్తుల గురించి పక్కా సమాచారం అందించిన వారికి భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సామాన్యులకు ఇది బంపర్ ఆఫర్‌గా చెప్పవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ (IT Department) నిబంధనల ప్రకారం, సమాచారం అందించిన వారికి మూడు దశల్లో నగదు అందనుంది. ప్రాథమికంగా సమాచారం నిజమని తేలితే, మొదటి విడతగా ₹10 లక్షల వరకు మధ్యంతర రివార్డుగా లభిస్తుంది. సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆస్తి విలువను బట్టి మొత్తం ₹1 కోటి వరకు బహుమతిగా అందజేస్తారు. విదేశాల్లోని అక్రమ ఆస్తుల వివరాలు అందిస్తే, ఈ రివార్డు మొత్తం ₹5 కోట్ల వరకు ఉండవచ్చు.
చాలామంది తమ నల్లధనాన్ని దాచుకోవడానికి ఇతరుల (డ్రైవర్లు, పనివారు లేదా బంధువుల) పేరు మీద భూములు, ఇళ్లు లేదా షేర్లను కొనుగోలు చేస్తారు. డబ్బు అసలు యజమాని పెట్టినా, కాగితాల్లో మాత్రం వేరే వారి పేర్లు ఉంటాయి. దీనినే 'బినామీ లావాదేవీ'గా పరిగణిస్తారు.
సమాచారం ఇచ్చే వ్యక్తులు తమ వివరాల గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను శాఖ భరోసా ఇస్తోంది. సమాచారం ఇచ్చే వారి పేరు, చిరునామా, అందించిన వివరాలను శాఖ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. విదేశీయులు సైతం ఈ సమాచారాన్ని అందించి రివార్డు పొందే అవకాశం ఉంది.
రివార్డు కోసం కావాలని ఎవరినైనా ఇరికించాలని ప్రయత్నించినా, లేదా తప్పుడు ఆధారాలు సృష్టించినా సమాచారం ఇచ్చిన వారికే శిక్ష తప్పదు. అలాంటి వారికి 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి, పక్కా ఆధారాలు ఉంటేనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
బినామీ ఆస్తులపై సమాచారం ఉన్నవారు నేరుగా తమ ప్రాంతంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలోని బినామీ నిషేధ విభాగానికి (Benami Prohibition Unit) వెళ్లి సంబంధిత అధికారులను కలవవచ్చు. లేదా ఐటి శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని, అక్రమ ఆస్తుల సమాచారాన్ని అందించి లక్షాధికారులు అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ సమాచారాన్ని పది మందికి తెలిసేలా షేర్ చేయాలని సూచిస్తున్నారు.




