రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, మధ్యప్రదేశ్ కు చెందిన చతుర్ సింగ్ మున్నా అనే వ్యక్తి మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి సి.ఐ బన్సిలాల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా, కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ వాదించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన చతుర్ సింగ్ మున్నాకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించారు.
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వేధింపులు లేదా అన్యాయం ఎదురైతే మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు.
నేరం చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి, ప్రస్తుత సిరిసిల్ల డిఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రచారి, అప్పటి, ప్రస్తుత సి.ఐలు బన్సిలాల్, వెంకటేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ, కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్, ఎస్.ఐ రమేష్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సి.ఎం.ఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల, భరోసా సెంటర్ లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికలను జిల్లా ఎస్పీ అభినందించారు.

