జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ గుట్టల తవ్వకం, మట్టి, రాళ్ల తరలింపు కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
నర్సింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సహజ గుట్టలు, కొండలు, భూగర్భ నిర్మాణాలు గ్రామ పర్యావరణ సమతుల్యతకు, వర్షపు నీటి సహజ ప్రవాహానికి, గ్రామ ప్రజల భవిష్యత్ ప్రయోజనాలకు అత్యంత ముఖ్యమైన ప్రకృతి వనరులుగా ఉన్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గ్రామపంచాయతీ పరిధిలోని కొన్ని గుట్టల వద్ద, సంబంధిత అధికారుల నుండి పొందిన అనుమతుల పరిమితులను అతిక్రమించి, అనుమతులు లేకుండా లేదా తాత్కాలిక/పరిమిత అనుమతులను ఆధారంగా చేసుకుని గుట్టలను తవ్వడం, తొలగించడం, భారీ యంత్రాలతో మట్టి, రాళ్లను వెలికితీయడం, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతున్నట్లు గ్రామ ప్రజల ద్వారా గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి వచ్చిందని తెలిపారు. కొన్ని సందర్భాలలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామ పరిధిలోని సహజ గుట్టల స్వరూపాన్ని శాశ్వతంగా మార్చే కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తీర్మానంలో తెలిపారు. కేవలం తాత్కాలిక అనుమతి లేదా ఏదైనా ఒక శాఖ నుండి పొందిన పరిమిత అనుమతి ఉన్నంత మాత్రాన, ఇతర చట్టబద్ధమైన అనుమతులు, క్లియరెన్స్లు, నిబంధనలు అవసరం లేని పరిస్థితి ఏర్పడదని స్పష్టం చేశారు. సంబంధిత ప్రాంతానికి మంజూరైన అనుమతులను సమగ్రంగా పరిశీలించి, చట్టవిరుద్ధత ఉన్నట్లయితే వాటిని రద్దు చేయాలని తీర్మానించారు. పర్యావరణానికి, ప్రజా ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరారు. ఈ తీర్మానాన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపాలని నిర్ణయించారు.












