గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రస్తుతం మండలంలో నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన రహదారులు ఇప్పుడు పిచ్చి చెట్లు, పొదలతో నిండిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, ప్రధాన రహదారుల ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, రహదారుల సుందరీకరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. అయితే ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల రహదారుల పరిస్థితిని పరిశీలిస్తే గతంలో కనిపించిన పచ్చదనం కనుమరుగైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రహదారుల ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి పచ్చని వాతావరణం కనిపించేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు రహదారుల వెంట హరితహారం మొక్కలు కనిపించకపోవడం, వాటి స్థానంలో పిచ్చి చెట్లు, పొదలు పెరగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొక్కల సంరక్షణ, నీటి సదుపాయం, కంచెల ఏర్పాటు, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం వంటి చర్యలు సక్రమంగా జరుగుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నర్సరీల నిర్వహణపై కూడా పర్యవేక్షణ కొరవడిందని, మొక్కల కొరత ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొంటున్న స్థానికులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రహదారుల వెంట పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. హరితహారం అమలు కొనసాగుతున్నదా మొక్కల పెంపకంపై దృష్టి సారించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్లక్ష్యంపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.












