జగిత్యాల జిల్లా కోరుట్ల గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా వంటి అంశాలను ఎస్పీ సమీక్షించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలపై ఆయన ఆరా తీశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. గణేష్ మండపాల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
నేరాల నియంత్రణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని ఆయన సూచించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేసి, చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని ఆయన తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ తనిఖీలో కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ శ్యామ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.

