దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు రానున్నాయి. అయితే ఈ సంస్కరణలు కార్పొరేట్ లాభాల కోసం కాకుండా, సామాన్యుల పొదుపు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల ప్రయోజనాల కోసం జరగాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చింది.
బ్యాంకుల తలుపులు కేవలం పారిశ్రామికవేత్తలకే కాదు, దేశానికి వెన్నెముకైన రైతన్నకు, పేద కార్మికుడికి కూడా సమానంగా తెరుచుకున్నప్పుడే ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌కి నిజమైన సార్థకత లభిస్తుంది - బాబు జగ్జీవన్ రామ్, భారత పూర్వ ఉప ప్రధాన మంత్రి. భారత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మార్పులు కోట్లాది ప్రజల పొదుపులు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలతో ముడిపడి ఉన్నందున వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పొదుపులు ప్రజలవే, వాటి మూలధనంలో ప్రజల పన్నుల సొమ్ము, వాటి లాభాల్లో లక్షలాది బ్యాంకు ఉద్యోగుల శ్రమ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
బ్యాంకింగ్ రంగంపై ఉన్నత స్థాయి కమిటీ
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగం పాత్రపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ నెల 18న ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల శిఖరాగ్ర సమావేశం కాన్ఫ్లుయెన్స్ 2026లో ఈ కమిటీకి అందజేయాల్సిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ప్రపంచంలోని ఐదు అతి పెద్ద బ్యాంకుల్లో కనీసం ఒక భారతీయ బ్యాంకు ఉండాలన్న ఆకాంక్షను ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వ్యక్తం చేశారు.
సామాన్యుల పొదుపు, కార్పొరేట్ల లాభాలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిట్లలో అరవై శాతానికి పైగా సామాన్య ప్రజలు, ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారు భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్మే. పొదుపు ఖాతాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ 2.5 నుంచి 2.7 శాతం, ఫిక్స్డ్ డిపాజిట్లపై సుమారు 6.5 శాతం మాత్రమే. మరోవైపు ద్రవ్యోల్బణం ఆరు శాతానికి చేరువలో ఉండటంతో సామాన్యుల పొదుపు విలువ క్రమంగా తగ్గుతోంది. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో నలభై శాతం వ్యవసాయం, చేతివృత్తులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు వంటి ప్రాధాన్యతా రంగాలకు ఇవ్వాలన్న నిబంధన ఉంది.


