చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దోపిడీ, దొరల దౌర్జన్యాలు, బహుజనులు ఎదుర్కొన్న వివక్ష, మహిళలు అనుభవించిన అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన చైతన్య జ్యోతి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదని, ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగిన మహోన్నత ఉద్యమమని పేర్కొన్నారు. తాము సాగు చేస్తున్న భూమిపై హక్కు సాధించాలనే సంకల్పంతో పేదలు, రైతులు, కూలీలు సంఘటితమై పోరాడిన చారిత్రక సందర్భంలో చాకలి ఐలమ్మ ముందుండి నాయకత్వం వహించి విజయాన్ని సాధించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి తరాలకు కూడా ఆదర్శప్రాయమని, సామాజిక న్యాయం, భూ హక్కులు, సమాన అవకాశాల కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ పాత్ర చిరస్మరణీయమని, ఆమె జయంతిని నిర్వహించడం ద్వారా రైతాంగ పోరాట స్ఫూర్తిని, మహిళా నాయకత్వాన్ని, అణగారిన వర్గాల హక్కుల సాధన గాథలను కొత్త తరాలకు పరిచయం చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి తెలంగాణ ప్రజలకు సామాజిక సమానత్వం, హక్కుల సాధన, మహిళా సాధికారత అనే త్రివేణి సంగమాన్ని గుర్తు చేసే ప్రేరణాత్మక దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


