ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలు, అక్రమ మార్పులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో మహా ధర్నా నిర్వహించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ ధర్నాకు తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే మందుల సామేల్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీ నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ధర్నాకు ముందు, కొత్త బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. నాయకులు, కార్యకర్తలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మహా ధర్నా నిర్వహించిన అనంతరం, కాంగ్రెస్ నాయకులు తమ డిమాండ్లను వినిపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమగ్ర వివరణ ఇవ్వాలని, పారదర్శకతను పాటించాలని, తమ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు.
చివరగా, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

