భద్రపద అమావాస్యతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ప్రకృతితో మమేకమయ్యేలా ప్రజలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
ప్రతి మనిషి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవనాధారంతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తుంది. అయితే, నేటి బిజీ జీవితంలో మనుషులతోనే కలవడానికి సమయం లేని మనిషి, ప్రకృతితో ఎలా మమేకమవుతాడు కానీ బతుకమ్మ పండుగ మాత్రం, తొమ్మిది రోజుల పాటు ప్రతి మనిషిని ప్రకృతితో మమేకం చేస్తుంది. ఇదే ఈ పండుగ గొప్పతనం.
ఈ పండుగ వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారం, ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందని, అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆమెను బతుకమ్మా అని దీవించారని చెబుతారు. అందుకే ఈ పండుగ స్త్రీలకు సంబంధించినదిగా, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకుంటారు.
ఈ సందర్భంగా స్త్రీలందరూ ఎటువంటి ఆపదలు రాకుండా, కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది విభిన్న రూపాలలో బతుకమ్మను ఆరాధించడం ఆనవాయితీ.
తొమ్మిది రూపాల బతుకమ్మలు
ఆ తొమ్మిది రూపాలు: 1. ఎంగిలిపూల బతుకమ్మ 2. అటుకుల బతుకమ్మ 3. ముద్దపప్పు బతుకమ్మ 4. నాన బియ్యం బతుకమ్మ 5. అట్ల బతుకమ్మ 6. అలిగిన బతుకమ్మ 7. వేపకాయల బతుకమ్మ 8. వెన్నముద్దల బతుకమ్మ 9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)








