రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే (ఐపీఎస్) ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతి భద్రతలు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా, శాంతి భద్రతలకు తీసుకుంటున్న చర్యలు వంటి పలు కీలక అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులను బాధ్యతగా స్వీకరించి, చట్టపరిధిలో సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని ఆయన కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ మోసాలపై ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వారిని చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని, డయల్ 112 కాల్స్పై తక్షణమే స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్ర చారి, స్థానిక ఎస్ఐ జ్యోతి, ఇతర సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.












