మండలంలో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, వారికి చీరలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఆయన అన్నారు.
మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన మంచాల లక్ష్మీధర్మారాజు, కార్కూరి జల వెంకటేష్ దంపతుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు, మండలం అలియా నాయక్ తండాకు చెందిన లావుడియా సుగుణరాజు, అనితభాషా దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి, మండలం రాజనగర్ గ్రామానికి చెందిన భూమక్కబలరాం దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, వారికి చీర కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కట్కాపూర్, ఆలూరు గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారం అవుతోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోందని ఆయన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారని, వారి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి మొదటి విడతలో 3,300 ఇందిరమ్మ ఇళ్లు, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మొదటి విడతలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలకు ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 1,189 ఇళ్లు, బీసీలకు 1,674 ఇళ్లు, అగ్రవర్ణ పేదలకు 78 ఇళ్లు, మైనార్టీలకు 219 ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని ఆయన అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల్లో అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.












