పండుగకు తన కూతురిని ఇంటికి పిలిపించుకున్న కుటుంబంలో విషాదం నెలకొంది. అక్కను స్కూటీపై ఇంటికి తీసుకెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కా తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పండుగకు కూతురిని ఇంటికి పిలిపించుకుని సంతోషంగా జరుపుకోవాలని భావించిన కుటుంబ ఆశలను విధి వక్రీకరించింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు వారి ఇంట విషాదం నింపింది. పండుగకు అక్కను స్కూటీపై తీసుకొస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో స్కూటీపై ఉన్న అక్కా తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా, వారి మూడేళ్ల కూతురు తీవ్రంగా గాయపడింది.
వివరాల్లోకి వెళితే, పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన కందుకూరు జంగయ్య, సువర్ణ దంపతులకు నలుగురు కూతుళ్లలో పెద్ద కుమార్తె రేఖ(34)ను శంషాబాద్ సుల్తాన్‌పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పిడుగు కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి మూడేళ్ల కుమార్తె చర్విత ఉంది. కాగా, ఇబ్రహీంపట్నానికి చెందిన ఏదుల్ల నర్సింహ్మ కుమారుడు నవీన్(25) ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన అతని పెద్దమ్మ సువర్ణ వద్ద ఉంటున్నాడు.
సువర్ణ దసరా పండుగకు తన కుమార్తె రేఖను ఇంటికి పిలిచింది. తల్లిగారింటికి వచ్చే క్రమంలో ఆమె ఎల్‌బినగర్‌లో బస్సు దిగి తన తమ్ముడు (చిన్నమ్మ కుమారుడు) నవీన్‌కు ఫోన్ చేసింది. నవీన్ స్కూటీపై అక్కను, ఆమె కూతురును తీసుకుని వస్తుండగా హయత్‌నగర్ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ముందుగా ఆగి ఉన్న డీసీఎం వాహనం వెనుక స్కూటీని ఆపాడు. సరిగ్గా అప్పుడే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు స్కూటీని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో అక్కా తమ్ముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మూడేళ్ల చిన్నారి చర్విత తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












