ఖమ్మం జిల్లా మండలంలోని వీర్ బంజర గ్రామంలో అప్పుడే పుట్టిన మగ శిశువును బొప్పాయి తోటలో వదిలివేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో గ్రామస్తులు సర్పంచ్ భూక్య రమణ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ చొరవతో శిశువు ప్రాణాలు దక్కించుకుంది.
వీర్ బంజర గ్రామంలోని బొప్పాయి తోటలో బుధవారం ఉదయం 6.30 గంటలకు శిశువు ఏడుపు వినిపించింది. గ్రామస్తులు వెంటనే స్పందించి, గ్రామ సర్పంచ్ భూక్య రమణకు సమాచారం అందించారు. సర్పంచ్ వెంటనే స్పందించి, మంచుకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని ఆశా వర్కర్ రామాదేవికి విషయాన్ని తెలియజేశారు.
ఆశా వర్కర్ రామాదేవి సంఘటనా స్థలానికి చేరుకుని, శిశువును పరిశీలించారు. అనంతరం సర్పంచ్ కారులో శిశువును ఖమ్మంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు వెంటనే శిశువుకు అవసరమైన వైద్య సేవలు అందించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, శిశువును ఎవరు వదిలివెళ్లారనే కోణంలో విచారణ చేపట్టారు. శిశువు ప్రస్తుతం చిల్డ్రన్ ప్రొటెక్షన్ అధికారుల పర్యవేక్షణలో ఉంది.










