జిల్లా కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కల్లుకు బానిసైన తల్లి, 9వ తరగతి చదువుతున్న తన కూతురు ఫోన్ చూస్తుందని కోపంతో గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
కొత్తూరులోని హనుమాన్ కాలనీలో ఆటో డ్రైవర్ ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతులు ముగ్గురు కూతుళ్లతో నివాసం ఉంటున్నారు. కల్లుకు బానిసైన తల్లి విజయలక్ష్మి, 9వ తరగతి చదువుతున్న తన కూతురు సువర్చల (14)తో తరచూ గొడవపడేదని సమాచారం.
ఈ నెల 27వ తేదీన ఇంటికి తిరిగి వచ్చిన విజయలక్ష్మి, ఫోన్ చూస్తున్న సువర్చలను చూసి తీవ్ర ఆగ్రహానికి గురైంది. కోపంతో రగిలిపోయిన ఆమె, కూతురి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం, కూతురి మెడకు చీర చుట్టి, ఆత్మహత్య చేసుకుందని భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది.
ఇటీవల పుష్పవతి కావడంతో కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు మొదట్లో భావించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో కొన్ని తేడాలు కనిపించడంతో పాటు, తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు నిజాలు బయటపడ్డాయి. తరచూ ఫోన్ చూస్తుందని, చెప్పిన మాట వినడం లేదనే కారణంతో తానే కూతురిని గొంతు నులిమి హతమార్చినట్లు తల్లి విజయలక్ష్మి అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

