జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, కారణాలను విశ్లేషించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, జాతీయ రహదారులపై భద్రతా పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత మూడు నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ చేసి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వచ్చే వారం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, వేగ నియంత్రణ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు, రోడ్డు భద్రత పనులకు అవసరమైన నిధుల అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు.
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రివేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచిక బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు, చెవ్రాన్ మార్కర్లు, రోడ్ స్టడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, రోడ్ల వెంట ఆక్రమణలు తొలగించి అనధికార పార్కింగ్‌ను నియంత్రించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం కారణంగానే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో ఎక్కువగా గాయపడుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై ప్రాణనష్టం సంభవిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అతివేగ నియంత్రణ చర్యలను మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి నియంత్రించేందుకు ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు అవసరమని, పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఈ-చలాన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి భద్రతా జాకెట్లు, బారికేడ్లు, హెల్మెట్లు తదితర రక్షణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎస్పీ సూచించారు.
అనంతరం, జాతీయ రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి, విలువైన ప్రాణాలను కాపాడేలా అత్యవసర స్పందన వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ ఫ్రీ నంబర్ 1033కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.

