జగిత్యాల నియోజకవర్గంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి, వారికి త్వరితగతిన ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు.
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీవోలతో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి, వారికి త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఈ ప్రక్రియలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవోలు చిరంజీవి, రమాదేవి, నీరజ, భీమేష్, ఎంపీఓ వాసవి పాల్గొన్నారు.

