Suryapet/Nadigudem (ధర్మ రథం) నవంబర్ 15
నడిగూడెం: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం బాలల దినోత్సవం సందర్భంగా స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికలు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శులు, జోనల్ ఆఫీసర్, డిసిఒ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల పోస్టులకు బాలికలు చక్కగా తమ విధులను నిర్వర్తించారు. స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇబ్బందులు తమకు అర్థమైనట్లుగా ఉపాధ్యాయులుగా వ్యవహరించిన బాలికలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, వృత్తి విలువలను పెంపొందించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. బాలికల బోధనను ఉపాధ్యాయులు పరిశీలించి, చక్కగా బోధించిన వారిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

