Jagtial/Raikal (ధర్మ రథం) నవంబర్ 15
భారతీయ వ్యవసాయం, గోకృషి వాణిజ్యం ప్రకృతి, పంచభూతాలు, గ్రహగమనాలు, రుతువులు వంటి వాటి ఆధారంగా అత్యంత సుస్థిరమైన విధానంలో రుషి పరంపరలో రూపొందించబడ్డాయి. ఈ విధానం మానవజాతి ఆహార అలవాట్లు, సంస్కృతితో పెనవేసుకుని జీవన విధానాన్ని సుసంపన్నం చేసింది.
భారతీయ వ్యవసాయం, గోకృషి వాణిజ్యం ప్రకృతి-ప్రాణికోటికి మూలాధారమైన బ్రహ్మాండీయ శక్తి అయిన పంచభూతాలు, గ్రహగమనాలు, నక్షత్రప్రభావాలు, ఆయనాలు, రుతువులు, నైసర్గిక స్వరూపాల ఆధారంగా, అత్యున్నత సాంకేతికతతో అత్యంత సుస్థిరమైన విధానాన్ని రుషి పరంపరలో రూపొందించారు. అంతేకాదు, ఈ విధానాన్ని సుసంపన్నం చేయడానికి మానవజాతి ఆహార అలవాట్లు, పండుగలు, పబ్బాలు, సభ్యతలు, సంస్కృతిని వృద్ధి చేస్తూ, వ్యవసాయాన్ని, సంస్కృతిని పెనవేసి జీవన విధానాన్ని రూపొందించి అందించారు.
భవిష్యత్తు జనాభా పెరుగుదలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఎన్ని కోట్ల జనాభా అవసరాలను భూమాత తీర్చగలదనే విషయాన్ని అధర్వ వేదంలోని ద్వాదశకాండలో ప్రకృతికి అంకితం చేసిన తొలి సూక్తమైన పృథ్వీసూక్తం / భూసూక్తం ద్వారా సందేహాలను అధిగమించేలా వివరించారు. ఇది భూమాత సంపదలను అర్థం చేసుకోవడానికి, వాటిని సుస్థిరమైన పద్ధతిలో వినియోగించుకోవడానికి పర్యావరణ అనుకూలమైన ఆలోచనలను అందిస్తుంది. ఈ విధంగా పృథ్వీసూక్తం మానవ నాగరికత సుసంపన్నతకు గోవును ఆయువుపట్టుగా పేర్కొంది. యుగయుగాలుగా భూమాత వినాశనానికి గురైనప్పుడు, గోమాత తిరిగి పునర్జీవింపజేసి సుసంపన్నం చేస్తూ వస్తోంది.
గోమాత ప్రాముఖ్యత
నేల సారం, చీడపీడలు-రోగనిరోధక శక్తి వంటి అత్యంత శక్తిమంతమైన సమగ్ర అంశాలకు గోమాత ఒక సమగ్ర పరిష్కారం. ఆవుపేడ, మూత్రం వ్యవసాయానికి అత్యంత విలువైన కారకాలు. పాలు ఒకప్పుడు ఉప-ఉత్పత్తిగా ఉండేవి. అందుకే మనం ఆవు వృష్ఠభాగాన్ని మహాలక్ష్మిగా భావిస్తాం. పంట వ్యర్థాలలోని పోషకాలను తిరిగి వినియోగించుకునే ప్రభావవంతమైన కారకంగా గోమాతను అభివర్ణించారు.
కృషివాణిజ్యం
రైతులు వ్యవసాయ పంటలకు విలువ జోడించి, ప్రత్యక్షంగా వినియోగదారునికి అమ్మడమే కృషివాణిజ్యం. వ్యాపారం అంటే, రైతులు పండించిన పంటలను మధ్యవర్తియైన ఒక వ్యాపారి కొని, వాటిని వినియోగదారునికి అమ్మడం. దీనివల్ల ఇటు రైతును, అటు వినియోగదారుని వ్యాపారి శాసిస్తూ, వీలైనంత ఎక్కువ దోపిడీ చేస్తాడు. పూర్వకాలంలో కృషి-వాణిజ్యంలో రైతు-వినియోగదారు మధ్య ప్రత్యక్ష అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. ప్రపంచం నలుమూలల నుండి భారతీయ వ్యవసాయానికి సంబంధించి, ముఖ్యంగా లండన్ మ్యూజియం నుండి విలువైన గ్రంథాలను తెప్పించి, గోవింద్ వల్లభ్ పంత్ వ్యవసాయ విద్యాలయంలో వృక్షాయుర్వేదం అనే ఒక విభాగాన్ని స్థాపించారు. వారి తరువాత డాక్టర్ టి. సునీతాపాండే ఆ కార్యాన్ని ఎంతో ఓర్పుతో ముందుకు నడుపుతూ, తిరిగి భారతీయ వ్యవసాయ విధానాన్ని అనుసరింపచేయడానికి ప్రయత్నం సాగిస్తున్నారు.


