కేశంపేట్, 15 November
మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి చిన్న రేవల్లి శివారు వరకు మంజూరైన మట్టి రోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సహకారంతో మంజూరైన ఈ పనులను గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ తిప్పిశెట్టి కరుణాకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గత కొంతకాలంగా ఈ రహదారి గుంతలమయంగా మారడంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులకు రాకపోకలు కష్టతరంగా మారాయి. ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి మట్టి రోడ్డు మంజూరుకు సహకరించారు.
ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం కావడంతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ చిరకాల సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పిశెట్టి సుదర్శన్, ఉపాధ్యక్షుడు వట్టెల లింగం యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ ఏర్పుల లింగం ముదిరాజ్, వార్డు సభ్యులు బండ మల్లేష్ యాదవ్, అరవింద్, మాధవులు, మహమ్మద్ సుల్తాన్, వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుమ్మరి సత్యనారాయణ, కర్ణకోట యాదవజి, సూరం శీను, కుమ్మరి శేఖర్, సూరం నవీన్, రవీందర్ జి, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

