హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ 2026 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో అఫ్గానిస్థాన్ రెండోసారి పాల్గొనడం, రెండోసారే టైటిల్ గెలవడం విశేషం.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. దీంతో అఫ్గానిస్థాన్ ముందు 116 పరుగుల లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు.
ఇమ్రాన్ మీర్ అద్భుత ప్రదర్శన
ఇమ్రాన్ మీర్ కేవలం 14 బంతుల్లోనే అజేయంగా 53 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఫర్మానుల్లా సఫీ 7 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేయగా, కెప్టెన్ గుల్బదిన్ నాయిబ్ 6 బంతుల్లో 17 పరుగులు, కరీం జనత్ 5 బంతుల్లో 13 పరుగులు చేశారు. దీంతో అఫ్గానిస్థాన్ 5.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
టోర్నీలో అఫ్గానిస్థాన్ ప్రస్థానం
టోర్నీలో అఫ్గానిస్థాన్ గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా, ఒమన్ జట్లపై విజయాలు సాధించి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో స్కాట్లాండ్ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై ఫైనల్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.
గత మ్యాచ్‌లలోనూ అఫ్గాన్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫర్మానుల్లా సఫీ 14 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో సిద్దిఖుల్లా పాచా 10 బంతుల్లో అజేయంగా 45 పరుగులు సాధించాడు. సెమీఫైనల్లో కెప్టెన్ గుల్బదిన్ నాయిబ్ 16 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు.












