న్యాయమూర్తుల నియామకాల విషయంలో తాను కొలీజియంలో సభ్యుడిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించానని జస్టిస్ గవాయ్ తన లేఖలో తెలిపారు. అగ్రవర్ణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా సిఫారసులు చేసినట్లు ఆయన వివరించారు. అయితే, ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఈ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందిన వారికి న్యాయమూర్తులుగా పదోన్నతులు, నియామకాల విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. తాను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నదే తన అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి గత మార్చిలో రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలను గవాయ్ తన లేఖలో ప్రస్తావించారు. 2018 నుంచి హైకోర్టులకు నియమితులైన 715 మంది న్యాయమూర్తుల్లో ఎస్సీ వర్గానికి చెందినవారు కేవలం 22 మంది, ఎస్టీలు 16 మంది, ఓబీసీలు 89 మంది, మైనారిటీ వర్గాలకు చెందినవారు 37 మంది మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన వారిలో సుమారు మూడొంతుల మంది జనరల్ కేటగిరీకి చెందినవారేనని ఆయన వివరించారు. 2021 జనవరి నుంచి 2026 జనవరి వరకు జరిగిన నియామకాలను పరిశీలిస్తే, అగ్రవర్ణాలకు చెందినవారి వాటా దాదాపు 80 శాతంగా ఉందని, ఓబీసీల ప్రాతినిధ్యం 14 శాతం కంటే తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో ఓబీసీల వాటా గణనీయంగా ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థలో వారికి తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టులోనూ ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందినవారి ప్రాతినిధ్యం అసమానంగా పెరుగుతోందని గవాయ్ తన లేఖలో ఆరోపించారు. దేశ జనాభాలో ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ఒక సామాజిక వర్గానికి సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాతినిధ్యం మరింత పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తన లేఖలో ఆ సామాజిక వర్గం పేరును ఆయన నేరుగా ప్రస్తావించలేదు.
హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతుల విషయంలోనూ గవాయ్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వరుసగా చిన్న హైకోర్టులకు బదిలీ చేసిన అనంతరం, మరో ప్రముఖ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అదే సమయంలో ప్రతిభావంతుడైన మరో ప్రధాన న్యాయమూర్తిని చిన్న హైకోర్టుకు బదిలీ చేయడం వెనుక ఉన్న ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేశారు. మరో సందర్భంలో, ఒక న్యాయమూర్తిని శిక్షాత్మక కారణాలతో ఆయన సొంత హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేశారని, అనంతరం పెద్ద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల్లో ప్రతిభకు బదులుగా ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం ఏర్పడుతోందని తెలిపారు. అయితే, ఈ నియామకాలు, బదిలీల వెనుక కొలీజియం పరిగణనలోకి తీసుకున్న అసలు కారణాలు తనకు తెలిసినప్పటికీ, న్యాయపరమైన క్రమశిక్షణ, మర్యాద దృష్ట్యా వాటిని వెల్లడించలేనని లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉందని గవాయ్ గుర్తుచేశారు. కొలీజియం సిఫారసులకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆ వ్యవస్థ జవాబుదారీతనానికి అతీతం కాదని స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్, న్యాయవ్యవస్థకు సమాన బాధ్యత ఉందని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు గతంలో ప్రభుత్వాలు కూడా కొలీజియానికి సూచనలు చేశాయని గుర్తుచేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా రాష్ట్రపతి తగిన జోక్యం చేసుకోవాలని కోరారు. న్యాయవ్యవస్థలో ప్రతిభ, వైవిధ్యం, సమానత్వం పరిరక్షణకు అన్ని రాజ్యాంగ వ్యవస్థలు బాధ్యత తీసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.


