హనుమకొండ, 2026-11-28
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో న్యాయవాదులు ముందుండాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ పిలుపునిచ్చారు.
విద్యతోనే సామాజిక న్యాయం, మహిళా అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పి, బానిసత్వం లేని సమసమాజ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో న్యాయవాదులు ముందుండాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ఐఎల్పీఏ వరంగల్, హనుమకొండ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయిని నరేందర్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల వేల ఏళ్ల బానిసత్వ విముక్తి కోసం పూలే త్యాగపూరిత పోరాటం చేశారని కొనియాడారు. మహిళలకు, అణగారిన వర్గాలకు విద్యను అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల మధ్య ఉన్న రక్తసంబంధాల చరిత్రను బోధించి మూలవాసుల ఐక్యతకు కృషి చేశారని గుర్తు చేశారు. పూలే అందించిన విద్య అనే ఆయుధంతో పాటు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో బహుజన ప్రజలను చైతన్యం చేసి సామాజిక న్యాయం సాధించాలని నరేందర్ అన్నారు. సామాజిక అణచివేతపై అవగాహన ఉన్న ఉన్నత విద్యావంతులైన న్యాయవాదులు చైతన్యవంతమైతేనే మూలవాసి సమాజం ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ.. పూలే, అంబేద్కర్ సిద్ధాంతాల వెలుగులో సాగుతున్న ఐఎల్పీఏ బలోపేతానికి వరంగల్ జిల్లా న్యాయవాదులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఇటీవల వరంగల్లో జరిగిన ఐఎల్పీఏ 6వ రాష్ట్ర సదస్సును మహిళలు, యువ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని, భవిష్యత్ తరాల భవితవ్యంలో ఐఎల్పీఏ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. సభాధ్యక్షత వహించిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిల్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా దోపిడి కులాలు అణగారిన వర్గాల ఓట్లతో గద్దెనెక్కి బహుజన సమాజాన్ని అణచివేస్తున్నాయని చిల్ల రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఓట్లు మనవైనప్పుడు సీట్లు, రాజ్యాధికారం కూడా మనదే కావాలి అనే నినాదంతో ఓట్ల చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం సాధించి, ఆపై అన్ని రంగాల్లో న్యాయమైన వాటా కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర సదస్సు విజయవంతమైన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నలుగురిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. వరంగల్ బార్ నుండి అబ్దుల్ నభి, జన్ను ఆనంద్ కుమార్, హనుమకొండ బార్ నుండి లడే రమేష్, మహబూబాబాద్ నుండి వాసం ఆనంద్ కుమార్లకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన సభలో నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు లడే రమేష్, జన్ను ఆనంద్ కుమార్లను రెండు జిల్లాల నాయకత్వం శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది.
సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థలో బహుజన శక్తిని పెంచడానికి, సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షులు విలాసాగరం సురేందర్ గౌడ్ స్వాగతం పలుకగా, ప్రధాన కార్యదర్శి గురిమిల్ల రాజు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జన్ను పద్మ, అనుమాండ్ల రాజ్ కుమార్, పెండ్యాల అనిల్ కుమార్, బండారి కవిత, రాచర్ల సురేష్, ఎలమాద్రి రవి, పోతన సంధ్యారాణి, కె. నిర్మల జ్యోతి, జన్ను ప్రభాకర్, దండు మోహన్, కర్రు పావని, హరి కుమార్, అషిక పావని, లక్క చంద్రశేఖర్, నీరటి శ్రీపతి కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



