న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించారు. సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదని, ఐదు రోజుల మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు.
న్యూజిలాండ్ టాప్ ఆర్డర్లో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వివరించారు. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన పేస్ దళంపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. తొలి రోజు భారత్ బౌలర్లు ఆరంభంలో న్యూజిలాండ్‌ను 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయేలా చేశారు. అయితే హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. నికోల్స్ 113 పరుగులతో, ఫిలిప్స్ 94 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్‌ను పక్కన పెట్టిన నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కొటక్ జట్టు ఎంపికను సమర్థించారు.


