మహారాష్ట్రలోని రతన్షి ప్రేమ్జీ ఛారిటబుల్ ట్రస్టుకు చెందిన భూముల విక్రయానికి సంబంధించి కీలక తీర్పు వెలువడింది. ఈ భూముల అమ్మకానికి ఛారిటీ కమిషనర్ ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ట్రస్టు భూముల విక్రయానికి సంబంధించిన గత అనుమతులు, రిజిస్ట్రేషన్లు తిరిగి చెల్లుబాటులోకి వచ్చాయి.
వడవలి, ఓవలే గ్రామాల్లోని ట్రస్టు భూములను విక్రయించాలని ట్రస్టీలు నిర్ణయించారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ఈ భూములు ఆక్రమణలకు గురికావడం, నిర్వహణలో ఇబ్బందులు, న్యాయపరమైన వివాదాలు తలెత్తడంతో వాటిని అమ్మకానికి పెట్టారు. బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా డెస్టినీ రియల్ప్రో డెవలపర్స్ ఎల్ఎల్పీ (గతంలో ఫెన్కిన్ ఇన్ఫోటెక్ ఎల్ఎల్పీ) అత్యధిక ధరను కోట్ చేయడంతో వారికి విక్రయానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్టుల చట్టం-1950లోని సెక్షన్ 36(1)(ఎ) ప్రకారం ఛారిటీ కమిషనర్ ఈ విక్రయానికి అనుమతి మంజూరు చేశారు.
అయితే, భూముల విలువ అంచనా, తగ్గింపులు, విక్రయ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టు ఈ అనుమతులను రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను జస్టిస్ పామిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం హైకోర్టుకు ఉన్న పర్యవేక్షణాధికారాన్ని అప్పీళ్ల విచారణలాగా ఉపయోగించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఛారిటీ కమిషనర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో, బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కనపెట్టి, ఛారిటీ కమిషనర్ అనుమతులను, భూముల విక్రయ పత్రాలను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు నవంబర్ 26న వెలువడింది.


