హనుమకొండ జిల్లా/పరకాల (ధర్మ రథం) ఆగస్టు 15
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 16న (ఆదివారం) పరకాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.400 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 16న (ఆదివారం) మధ్యాహ్నం పరకాలలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరకాలలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తో కలిసి పరకాలలోని స్థానిక అంగడి స్థలం వద్ద భారీ బహిరంగ సభ ప్రాంగణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను ప్రత్యక్షంగా మంత్రి శనివారం పరిశీలించారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
పరకాలలోని అంగడి స్థలం వద్ద సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, ట్రాఫిక్, భద్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో రూ.400 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల చిరకాల అవసరాలను తీర్చే ఈ కార్యక్రమాలు పరకాల అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయన్నారు.
వంద పడకల ఆసుపత్రి
గతంలో శంకుస్థాపన చేసిన పరకాల వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చి పూర్తి చేసిందన్నారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కృషి, ముఖ్యమంత్రి సహకారంతో ఆసుపత్రి అందుబాటులోకి వస్తుండటంతో పరకాల, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే లభించనుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రెండు విడతల్లో పరకాల నియోజకవర్గానికి సుమారు 6,000 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మొదటి విడతలో 3,500, రెండో విడతలో 2,500 ఇళ్లు మంజూరు కాగా, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున సుమారు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం అందనుందని చెప్పారు. అర్హులైన మరిన్ని కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి సభకు పరకాల నియోజకవర్గం నుంచి సుమారు 75 వేల నుంచి 80 వేల మంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో పార్కింగ్, ట్రాఫిక్, భద్రతతో పాటు అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.







