జగిత్యాల జిల్లా మండలం భూపతిపూర్ గ్రామంలో సామాజిక సేవలో భాగంగా విజేత వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని సమకూర్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఈ రథాన్ని అందజేశారు. గత 22 ఏళ్లుగా గ్రామంలో నవరాత్రుల నిర్వహణలో మిగిలిన నిధులతో ఈ రథాన్ని కొనుగోలు చేశారు.
భూపతిపూర్ గ్రామంలో 2003లో విజేత వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో, దుర్గమాత చందాదారుల సహకారంతో నవరాత్రులను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రుల నిర్వహణలో మిగిలిన నిధులను గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, చందాదారుల భాగస్వామ్యంతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని భూపతిపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ గుర్రం భావన-మహేందర్, ఉప సర్పంచ్ మూగల సంజీవ చారిలకు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు మామిడాల నాగరాజు మాట్లాడుతూ, విజేత యూత్ ద్వారా గ్రామంలో ఎంతోమందికి సహకారం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధిలో ముందుండి పెద్దన్న పాత్ర పోషిస్తూ, మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి మహేశ్వర్ రావు, మాజీ ప్రెసిడెంట్ సోమ రమేష్ రెడ్డి, యూత్ సభ్యులు లక్ష్మినారాయణ, ఆనంద్, టి.తిరుపతి, బి. తిరుపతి, శేఖర్, నాగరాజు, మహేష్, పురుషోత్తం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విజేత యూత్ చేస్తున్న సేవలను గ్రామస్తులు అభినందించారు.












