భూమి సక్సెషన్ (వారసత్వ హక్కుల బదిలీ) ప్రక్రియ కోసం భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి, తీసుకుంటున్న కీసర తహసిల్దార్ కార్యాలయ అధికారులను గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిప్యూటీ తహసిల్దార్‌తో సహా మరో ఇద్దరు సిబ్బందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కీసరకు చెందిన పన్నుల బుచ్చి రెడ్డి భార్య పన్నాల సుశీల ఇటీవల మృతి చెందారు. ఆమె పేరిట కీసరలోని సర్వే నంబర్లు 183, 184 లో ఉన్న 3 ఎకరాల భూమిని సక్సెషన్ ద్వారా తన పేరిట మార్చుకునేందుకు కుమారుడు పన్నాల గిరిధర్ రెడ్డి కీసర తహసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ భూమి 22 (ప్రభుత్వ నిషేధిత జాబితా) లో ఉందని, సక్సెషన్ పూర్తి కావాలంటే తహసిల్దార్‌తో పాటు ఆర్డీవో కార్యాలయ అధికారులకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ డిప్యూటీ తహసిల్దార్ సందీప్ రెడ్డి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని గిరిధర్ రెడ్డి ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం బాధితుడి నుంచి రూ. 2.50 లక్షల నగదును తహసిల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. అనంతరం ఆ నగదును రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణకు అందించగా, బాలకృష్ణ ఆ డబ్బును డిప్యూటీ తహసిల్దార్ సందీప్ రెడ్డి గదిలోకి తీసుకెళ్లి అతని బ్యాగ్‌లో పెడుతుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో డిప్యూటీ తహసిల్దార్ సందీప్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ రెడ్డి, రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి, రూ. 2.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. రసాయన పరీక్షల్లో నిందితుల పాత్ర స్పష్టంగా నిరూపితమైందని, కేసు నమోదు చేసి నిందితులను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. సామాన్యులకు చెందాల్సిన ప్రాథమిక రెవెన్యూ సేవల కోసం కూడా లక్షల రూపాయల లంచాలు డిమాండ్ చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ దాడితో కీసర తహసిల్దార్ కార్యాలయంలో తీవ్ర కలకలం రేగింది.












