రాప్తాడు జడ్పీ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థిని గోపికపై ఆమె వరసకు బాబాయ్ అయిన హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందడంతో హేమంత్ కొంతకాలం అక్క సంరక్షణలో పెరిగాడు. నిందితుడు మద్యం, గంజాయికి బానిసయ్యాడు.
నిందితుడి ప్రవర్తన నచ్చక అతని అక్క అతన్ని ఇంటి నుంచి పంపించింది. ప్రస్తుతం హేమంత్ అనంతపురం శివారులో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. టమాటా మండీలో కూలీగా పనిచేస్తున్నాడు. గతంలో రాప్తాడు బీసీ బాలుర వసతిగృహానికి వెళ్లి విద్యార్థులపై దాడి చేసిన ఘటనలోనూ హేమంత్ ప్రమేయం ఉంది.
కొంతకాలంగా గోపిక పాఠశాలకు వెళ్లే సమయంలో ఆమెను అనుసరిస్తున్నట్లు తోటి విద్యార్థినులు వెల్లడించారు. ఈ విషయంపై గతంలోనే హేమంత్‌ను గోపిక తల్లిదండ్రులు మందలించారు. అయినా వేధింపులు ఆపకుండా, పక్కా ప్రణాళికతో పాఠశాలలోకి చొరబడి దాడి చేశాడు.
నిందితుడు కూలీ వేషంలో పాఠశాలలోకి ప్రవేశించి, పక్కా ప్లాన్‌తో దాడి చేశాడు. రాప్తాడు జడ్పీ పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెటీరియల్‌తో కూలీలు ఆటోలో పాఠశాలకు వచ్చిన సమయంలో, వారి వెనుకే హేమంత్ లోపలికి ప్రవేశించాడు. పాఠశాల సిబ్బంది అతన్ని పనుల కోసం వచ్చిన కూలీగా భావించారు.
ఉదయం 10 గంటల సమయంలో నిందితుడు తరగతి గది వద్దకు వెళ్ళాడు. బయటే ఎలక్ట్రిక్ రంపాన్ని ఆన్ చేశాడు. చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్నాడని టీచర్ భావించాడు. టీచర్ ప్రశ్నించేలోపే తరగతి గదిలోకి చొరబడి గోపికపై దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు రంపాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.












