కరీంనగర్, 7 July
కరీంనగర్ రూరల్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అర కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, యువకుడు మహారాష్ట్ర నుంచి గంజాయిని తరలించి, స్థానికంగా విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు.
కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న కవరును తనిఖీ చేయగా, అందులో అర కిలోకు పైగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
విచారణలో నిందితుడు తన పేరు బట్టి శివ (23), బొందిల కులం, సరస్వతి నగర్, తీగలగుట్టపల్లి నివాసి అని తెలిపాడు. జమోటా పని చేస్తూ జీవనం సాగిస్తున్న తాను, అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి సుమారు అర కిలో గంజాయిని కొనుగోలు చేసి కరీంనగర్‌కు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నాడు.
ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కో ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తూ సుమారు రూ.10,000 సంపాదించినట్లు వెల్లడించాడు. మిగిలిన గంజాయిని చొప్పదండి, నగునూరు ప్రాంతాల్లో లారీ డ్రైవర్లు, ఇతరులకు విక్రయించడంతో పాటు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో విక్రయించేందుకు వచ్చినప్పుడు పోలీసులకు పట్టుబడ్డాడు.
అనంతరం ఇద్దరు పంచుల సమక్షంలో నిందితుడి వద్ద లభ్యమైన గంజాయిని స్వాధీనం చేసుకొని, చట్టపరమైన పంచనామా నిర్వహించారు. నిందితుడిపై NDPS Act కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవించడం, విక్రయించడం లేదా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకురావడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.









