కోరుట్ల / మెట్పల్లి (ధర్మ రథం) జూలై 21
కోరుట్ల బస్ స్టాండ్‌లో ప్రయాణికుల కోసం నిలిపిన ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి దొంగిలించి పరారయ్యాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో పలు వాహనాలను ఢీకొట్టడంతో కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి, మెట్పల్లి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కోరుట్ల బస్ స్టాండ్‌లో బస్సు అపహరణకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికుల కోసం నిలిపిన ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి దొంగిలించి పరారవుతుండగా, మార్గమధ్యలో పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి నిందితుడిని మెట్పల్లి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోరుట్ల బస్ స్టాండ్‌లోని 9వ ప్లాట్‌ఫామ్ వద్ద కల్లూరు గ్రామానికి వెళ్లాల్సిన బస్సును నిలిపారు. బస్సు డ్రైవర్ టీ తాగడానికి కొద్దిసేపు పక్కకు వెళ్లిన సమయంలో, అక్కడే సంచరిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి డ్రైవర్ లేని అదను చూసి బస్సును స్టార్ట్ చేసి అపహరించాడు.
బస్సు పోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన కోరుట్ల పోలీసులు వెంటనే అపహరణకు గురైన బస్సును వెంబడించారు. దుండగుడు బస్సును నిజామాబాద్ వైపు అతివేగంగా దూసుకెళ్తూ, మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న పలు వాహనాలను ఢీకొట్టడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు ముమ్మరంగా వెంబడించడంతో నిందితుడు బస్సును మరింత వేగంగా పోనిచ్చాడు. అయితే, మెట్పల్లి ప్రాంతంలోని గండి హనుమాన్ దేవాలయం వద్దకు చేరుకునేసరికి అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంతలో ఇరుక్కుపోయి ఆగిపోయింది.
బస్సు దిగిన దుండగుడు అక్కడి నుంచి కాలినడకన పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వెంబడించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం అతడిని మెట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బస్సు అపహరణ, వాహనాలను ఢీకొట్టుకుంటూ పోవడం వంటి ఘటనలతో బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











