తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు దేవస్థానం మెట్ల మార్గం దుస్థితి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వేలాదిగా తరలివచ్చే భక్తులు గుట్టపైకి చేరుకోవడానికి ఉపయోగించే మెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. రాళ్లు ఊడిపోవడం, పాములు తిరిగేలా రంధ్రాలు పడటంతో భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మరో శ్రీశైలం గా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు దేవస్థానం. ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఎక్కువగా మెట్ల మార్గాన్ని గుట్టపైకి వెళ్లడానికి ఎంచుకుంటారు. కోరిన కోరికలు తీరినప్పుడు భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి మెట్లకు బొట్లు పెడతారు. అలా బొట్లు పెట్టుకుంటూ గుట్టపైకి చేరుకుంటారు. కానీ మెట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మెట్లు ఎక్కడికక్కడ రాళ్లు ఊడిపోవడం, మెట్ల మధ్యలో పాములు తిరిగే విధంగా రంధ్రాలు పడటం, మెట్లు అనే రూపురేఖలు లేకుండా ఊడిపోవడం జరిగింది. గుట్ట పైకి వెళ్లే కొద్దీ మెట్లు లేవు, రాళ్లు తేలి ఉన్నాయి. దయచేసి అధికారులు పట్టించుకొని మెట్ల మార్గాన్ని సరి చేయవలసిందిగా భక్తులు కోరుతున్నారు. మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు సేద తీరడం కోసం రెండు విశ్రాంతి షెడ్లు నిర్మించారు. కానీ వాటి పైకప్పు ఊసిపోయేలా ఉంది. రేకులపై మామూలు రాళ్లు పెట్టి ఉంచారు. కూర్చోవడానికి వీలుగా లేదు. మెట్ల మార్గంలో లైట్లు సరిగ్గా లేవు. భక్తులు తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదు. మెట్ల మార్గంలో ఎడమవైపున ఉన్న వినాయకుని విగ్రహానికి గత పది సంవత్సరాల క్రితం వేసిన రంగులు మాత్రమే ఉన్నాయి. అవి బెచ్చుల రూపంలో ఊడిపోతున్నాయి. అక్కడ భక్తులు నిలబడటానికి, పూజలు చేయడానికి ఏమాత్రం వీలుగా లేదు. బేస్మెంట్ రాళ్లతో తేలి ఉంది, చుట్టూ ఎలాంటి ఫినిషింగ్ లేదు.
రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు మధ్యలో పెద్ద శివుని విగ్రహం ఉంటుంది. ఏ ఉత్సవాలకు కూడా ఈ విగ్రహానికి రంగులు వేయడం జరగదు. దయచేసి అధికారులు పట్టించుకొని ఈ విగ్రహాలకు రంగులు వేయించాలి. గుట్టపైకి వెళ్లేటప్పుడు మెట్ల పై భాగాన రౌండ్ గా రేకులు వేయడం కోసం మెట్లకు ఇరువైపులా పిల్లర్లు పోయడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ పని ప్రారంభం కాలేదు. దయచేసి ఇలాంటి చిన్న చిన్న పనులను ప్రభుత్వ అధికారులు, ఈవో గారు పట్టించుకొని మెట్ల మార్గంలో ఉండే ఇబ్బందులను గుర్తించి సరి చేయవలసిందిగా భక్తులు కోరుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో ఉన్న గోపురం పైన కూడా లైటింగ్ లేదు. అక్కడ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా భక్తులు తమ కోరికలు తీరినప్పుడు, వాటిని నెరవేర్చుకోవడానికి ఎక్కువగా మోకాళ్లపై ఎక్కుతుంటారు. కనుక ఆ భక్తులను దృష్టిలో ఉంచుకొని మెట్లను సరి చేయవలసిందిగా అధికారులను భక్తులు కోరుతున్నారు. ఈవో గారు ఈ మెట్ల మార్గాన్ని ఒకసారి పరిశీలించి సరి చేయవలసిందిగా భక్తులు కోరుతున్నారు.












