బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గంగానదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తా పడటంతో 13 మంది చిన్నారులు మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు సమాచారం అందడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాంపూర్ శ్యామ్చంద్ గ్రామానికి చెందిన గ్రామస్థులు మంగళవారం రాత్రి గంగానది దాటి పక్క గ్రామంలో ఏర్పాటు చేసిన విందుకు వెళ్లేందుకు పడవలో బయలుదేరారు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో నదిలో ప్రయాణిస్తుండగా పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. పడవలో 20 మందికి పైగా ప్రయాణికులు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నదిలోకి దిగి బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన 13 మంది చిన్నారుల వయసు 15 ఏళ్లలోపే జిల్లా కలెక్టర్ వర్షా సింగ్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన పడవను అధికారులు నది నుంచి బయటకు తీశారు.
పరిహారం ప్రకటన
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారుల మరణాలపై విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
స్థానికుల ఆందోళన
ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పడవ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారిక విచారణ వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.











