జగిత్యాల, 17 November
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్లోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్పార్కిల్ 226 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించిన 16 రకాల నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయ్యప్ప, శివతాండవం, సేవ్ వాటర్, కరుప్పా, జోకర్, జానపద పాటలతో పాటు పలు వైవిధ్యభరితమైన నృత్యాలతో చిన్నారులు సందడి చేశారు. తమ ప్రతిభతో సభికులను అలరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, బాలలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం విద్యార్థుల్లో ఆనందం, సృజనాత్మకతను పెంపొందించే వేడుకగా నిలుస్తుందన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జయశ్రీ, డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థినీవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







