జగిత్యాల, 2026-11-21
ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తూ, బాధితులకు రక్షణ, న్యాయం, కౌన్సెలింగ్ అందించాల్సిన సఖి సెంటర్ సిబ్బందికి వేతన కష్టాలు తప్పడం లేదు.
ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తూ, బాధితులకు రక్షణ, న్యాయం, కౌన్సెలింగ్ అందించాల్సిన సఖి సెంటర్ సిబ్బందికి వేతన కష్టాలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లాలోని సఖి సెంటర్లో పనిచేస్తున్న 12 మంది సిబ్బందికి గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
సఖి సెంటర్లో మొత్తం 12 పోస్టులకు గాను ఎన్జీవో ప్రతినిధి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, ఇద్దరు కేస్ వర్కర్లు, ఒక పారామెడికల్ సిబ్బంది, ఒక కౌన్సెలర్, ఇద్దరు మల్టీపర్పస్ సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఒక లీగల్ అడ్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. ఐటీ విభాగానికి సంబంధించిన ఒక పోస్టు ఖాళీగా ఉంది.
మహిళలపై వేధింపులు, గృహహింస, ఇతర సమస్యలతో సఖి సెంటర్ను ఆశ్రయించే బాధితులకు సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా వేతనాలు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వం మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, మహిళలకు సేవలందించే సఖి సెంటర్ సిబ్బందికి వేతనాలు అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు, భవిష్యత్తులో వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సఖి సెంటర్ సిబ్బంది కోరుతున్నారు.







