మునగాల, జులై 25
కోదాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడిందని విమర్శించారు. మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామంలో రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుల పక్షాన ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.
మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, పెట్టుబడి భారంతో పాటు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితులపై రైతులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు వ్యవసాయం పండుగలా సాగేదని, రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉండేవని అన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడిందని విమర్శించారు. రైతు నష్టపోయే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, రైతుల పెట్టుబడులు నీటిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం తక్షణమే సాగునీరు అందించడంతో పాటు, చాలి చాలని నీళ్ళతో పంటను బ్రతికించుకోవడానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాసిరకం విత్తనాలు మరియు నకిలీ, కల్తీ ఎరువులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.
రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని, రైతును ఆదుకోవడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని అన్నారు.
ఒకప్పుడు పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు నేడు ఎడారిని తలపించే పరిస్థితి నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు ఎందుకు అందించలేకపోయారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా బలపడాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించి మొద్దు నిద్రలో ఉందని విమర్శించిన ఆయన, రైతుల కష్టాలు, కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. ఈ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు అవసరమైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఆకుపాముల పిఎసిఎస్ చైర్మన్ వల్లపురెడ్డి రాంరెడ్డి అధ్యక్షత వహించగా, మునగాల, తాడువాయి పిఎసిఎస్ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, వెంకట్రాంపురం సర్పంచ్ బుసి వెంకటేశ్వర్లు, నేలమర్రి సర్పంచ్ రాంపంగు సుందరయ్య, ముకుందాపురం మాజీ సర్పంచ్ దాసరాజు రాధా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్రా సత్యనారాయణరెడ్డి, ఇంద్రశేఖర్ రెడ్డి, సారెడ్డి నాగిరెడ్డి, దాసరాజు లక్ష్మణ్, రషీద్, బొమ్మ చిన్నవెంకన్న, నూకమల్ల రామకృష్ణ, గడ్డం లింగయ్య, సైదా, పలువురు రైతులు పాల్గొన్నారు.






