మండలం, గట్లకానిపర్తి గ్రామంలో సరైన రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ఎస్సీ కాలనీలోకి నీరు చేరుతోంది. దీంతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. వర్షపు నీటితో పాటు తేళ్లు, పాములు ఇళ్లలోకి వస్తుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం తప్ప, ఆ తర్వాత పట్టించుకునేవారు లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి గోడలు నాని పెచ్చులు ఊడుతున్నాయి
బొమ్మకంటి అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంటి వెనుక వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇల్లు పూర్తిగా తడిసి, గోడలు నాని పెచ్చులు ఊడిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు కూలిపోయే పరిస్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిలిచిన నీటిలో కొందరు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.
శాశ్వత పరిష్కారం కోరుతూ విజ్ఞప్తి
గతంలో వర్షపు నీరు ఏ విధంగా ప్రవహించేదో, అదే విధంగా సహజ నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా కాలువలను ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీని పరిశీలించి, డ్రైనేజీ కాలువలు, రోడ్డు సౌకర్యం కల్పించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అజయ్ కుమార్తో పాటు కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ ఇళ్లు దెబ్బతిని ప్రమాదకర పరిస్థితిలో ఉన్నందున అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గ్రామ ప్రజలు కూడా సమస్య తీవ్రతను అర్థం చేసుకుని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.












