తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త ఏఐసీసీ ఇన్చార్జ్లు, పీసీసీ అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. తెలంగాణకు కొత్త ఇన్చార్జ్గా ఎ. చెల్లకుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్చార్జ్లను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో, ఐదారు రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో ఎ. చెల్లకుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మీనాక్షి నటరాజన్ ఈ నెల 18వ తేదీ నుంచి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లనున్నారు. ఆమె సుమారు 10 నెలల పాటు కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు.
మీనాక్షి నటరాజన్ అందుబాటులో లేని సమయంలో, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు కొత్త నాయకత్వ నియామకాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ నియామకాల ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.











