మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులో 2024 వరదల సమయంలో కొట్టుకుపోయిన ఆకేరు వాగు బ్రిడ్జి నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిని సందర్శించిన ఆమె, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులో 2024లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన ఆకేరు వాగు బ్రిడ్జి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూలిపోయిన ముల్కలపల్లి బ్రిడ్జిని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. మహబూబాబాద్-ఖమ్మం జిల్లాలను కలిపే కీలకమైన ముల్కలపల్లి బ్రిడ్జి కూలిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల సందర్భంలో మహబూబాబాద్ జిల్లాకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లిపోయారు తప్ప, ఆ హామీల అమలుకు మాత్రం సంవత్సరాలు గడుస్తున్నా ముహూర్తం కుదరడంలేదని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కాలయాపన అని ఆకేరు బ్రిడ్జి వ్యవహారం మరోసారి రుజువు చేసిందని విమర్శించారు.
ప్రజల ఇబ్బందులు కళ్లకు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆకేరు బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, లేనట్లయితే ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.











