నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సంచలన దాడి నిర్వహించారు. అధికారిక పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, బాధితుడు తన పనుల నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్‌లోని సంబంధిత శాఖను ఆశ్రయించగా, అక్కడి అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
రూ. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు
ఈ క్రమంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని రెండవ అంతస్తులో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్, బాధితుడి నుండి రూ. 15,000 లంచం తీసుకుంటుండగా, నిజామాబాద్ ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అతనితోపాటు అదే విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ద్వారా పూర్తి వివరాలు సేకరించి రికార్డు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని దర్యాప్తు ముగిసిన తర్వాత అధికారికంగా వెల్లడించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం స్థానికంగా కలకలం రేపింది.






