రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎండు మిర్చి కిలో రూ.300 పైమాటే పలుకుతుండగా, ఉల్లిపాయలు రూ.100కు చేరువయ్యాయి. బియ్యం, పప్పులు, వంట నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. ఒకవైపు ఉల్లి ధరలు ఇప్పటికే కిలో రూ.100కు సమీపించింది. మరోవైపు ఎండు మిర్చి కూడా సామాన్యులకు దడ పట్టిస్తోంది. బహిరంగ మార్కెట్లో ఎండు మిర్చి ధర కిలో రూ.300 పైబడి భారంగా మారింది. కందిపప్పు నుంచి పామాయిల్ దాకా ప్రతి నిత్యావసర సరుకు ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరల మోతపై ప్రణాళికా శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పలు సరుకుల ధరల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
ఎండు మిర్చి ధరలు భారీగా పెరిగాయి
ఎండు మిర్చి ధరలు ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. గ్రేడ్-1 ఎండు మిరపకాయల కిలో ధర తాజాగా రూ.297.41గా రికార్డు అయింది. గతేడాది రూ.181.63తో పోలిస్తే ఏకంగా 115.78 శాతం ధర పెరిగింది. గ్రేడ్-2 ఎండు మిరపకాయల ధర ప్రస్తుతం కిలో రూ.265.72గా ఉండగా, గత నెలలో రూ.259.01తో పోలిస్తే 2.59 శాతం, గతేడాది రూ.160.16గా ఉన్న ధరతో పోలిస్తే 105.56 శాతం పెరగడం గమనార్హం. అయితే బహిరంగ మార్కెట్లో కిలో రూ.300కు పైగానే అమ్ముతున్నారు. దీంతో వినియోగదారుడుపై మరింత భారం పడుతోంది.
ఉల్లి ధరలు అదుపులోకి రావడం లేదు
ఉల్లి ధరలు కూడా అదుపులోకి రావడం లేదు. గ్రేడ్-2 ఉల్లిపాయల ధర కిలో రూ.63.61గా ఉంది. గ్రేడ్-1 ఉల్లిపాయల ధర రూ.43.20గా ఉండగా, నెల వ్యవధిలో కిలోకు రూ.20.41 పెరిగింది. గతేడాది సెప్టెంబరు 20న కిలో రూ.25.71 ఉండగా, ఏడాది కాలంలో రూ.37.90, అంటే ఏకంగా 147.41 శాతం పెరుగుదల నమోదైనట్టు తేలింది. గ్రేడ్-2 ఉల్లిపాయల ధర కూడా తాజాగా కిలో రూ.55.73గా ఉండగా, గత నెలలో రూ.36.58గా, గతేడాది రూ.20.89గా ఉండడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో, చిన్న దుకాణాల్లో అయితే కిలో రూ.75 వరకు చేరిపోయింది.
బియ్యం ధరలు కిలో వందకు చేరాయి
బియ్యం ధరల్లోనూ పెరుగుదల స్పష్టంగా నమోదైంది. గ్రేడ్-1 సూపర్‌ఫైన్ బియ్యం కిలో ధర రూ.68.41గా ఉండగా, గత నెలలో రూ.66.18గా, గతేడాది రూ.60.04గా నమోదైంది. అంటే ఏడాది కాలంలో 8.37 శాతం పెరిగినట్టు తేలింది. గ్రేడ్-2 ఫైన్ బియ్యం కిలో ధర రూ.60.70గా ఉండగా, గత నెలతో పోలిస్తే 2.86 శాతం, గతేడాదితో పోలిస్తే 8.22 శాతం పెరిగింది. దుకాణాల్లో కిలో సూపర్ ఫైన్ బియ్యం రూ.75 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో సింగిల్ పోలిష్ బియ్యం అంటూ కిలో రూ.100కు విక్రయిస్తుండడం గమనార్హం.
వంట నూనెల ధరల్లోనూ పెరుగుదల నమోదైంది. పామాయిల్ లీటరు ధర ప్రస్తుతం రూ.155.20గా ఉండగా, గత నెలలో రూ.153.45గా, గతేడాది రూ.131.13గా ఉంది. అంటే ఏడాది కాలంలో 24.07 శాతం పెరిగింది. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ లీటరు ధర రూ.181.50గా నమోదైంది. గత నెల ధర రూ.179.22తో పోలిస్తే 1.27 శాతం, గతేడాదితో పోలిస్తే 32.07 శాతం అధికంగా ఉంది. వేరుశెనగ నూనె లీటరు ధర రూ.185.18గా ఉంది. గతేడాది రూ.159.71తో పోలిస్తే 25.47 శాతం పెరిగింది.







