ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందలేదని ఆయన ఆరోపించారు.
మండల కేంద్రంలోని రామచంద్రపురం గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంచుకున్నారని, ఒక్కో గ్రామానికి 600 ఇళ్లు ఇస్తామని చెప్పి, చివరకు 180 ఇళ్లకు మాత్రమే మంజూరు చేశారని ఆంజనేయులు తెలిపారు. ఆ 180 ఇళ్లకు బిల్లులు కూడా సక్రమంగా అందక లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి, కేవలం కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను మాత్రమే రాసుకొని, కార్యదర్శులతో కుమ్మకై ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఆన్లైన్ చేస్తున్నారని ఆంజనేయులు ఆరోపించారు. ఇళ్లు వస్తాయని ఆశ చూపి, ఇందిరమ్మ కమిటీల వారు డబ్బుల దందా చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, వాటి ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీల దోపిడీని బయటపెట్టి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా పోరాడతామని హెచ్చరించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి, ఎటువంటి అవినీతికి తావులేకుండా ఇళ్లు పంపిణీ చేశారని ఆంజనేయులు గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.











